ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల కన్నీటి నివాళి.. వీడియో ఇదిగో!

భారత సినీ సంగీత ప్రపంచంలో తన గానంతో చెరగని ముద్ర వేసిన లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన అర్ధాంగి అంజలి నేడు ఆమె నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

ముంబైలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఆశా భోంస్లే నివాసం 'కాసా గ్రాండే'కు చేరుకున్న సచిన్ దంపతులు, ఆమె పార్థివదేహాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. త్రివర్ణ పతాకంలో చుట్టి, తెల్లటి లిల్లీ పూలతో అలంకరించిన గాజు పేటికలో ఉంచిన ఆమె భౌతికకాయం వద్ద వారు కన్నీటి పర్యంతమయ్యారు. 

ఆశా భోంస్లేతో తమకున్న అనుబంధాన్ని సచిన్ గుర్తుచేసుకున్నారు. ఇటీవలే జరిగిన తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి ఆశా హాజరయ్యారని, బహిరంగంగా ఆమె కనిపించిన చివరి కార్యక్రమాల్లో అది కూడా ఒకటని గుర్తుచేసుకున్నారు. ఆమె మరణంపై ఆదివారం స్పందిస్తూ.. "ఆశా తాయి (సోదరి) మాకు కుటుంబ సభ్యురాలి వంటి వారు. ఈ రోజు మాటలకు అందని బాధ‌ను మేము అనుభవిస్తున్నాం. ఆమె అద్భుతమైన పాటల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు" అని సచిన్ 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. 

క్రికెట్‌పై ఆశా ప్రేమ.. సచిన్‌పై ప్రశంసలు
ఆశా భోంస్లేకు క్రికెట్ అంటే ఎనలేని అభిమానం. సచిన్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో ఆమె క్రికెట్‌పై తనకున్న ఇష్టాన్ని పంచుకున్నారు. సునీల్ గవాస్కర్ సొగసైన ఆట, వివ్ రిచర్డ్స్ దూకుడు తనను ఆకట్టుకున్నాయని.. అయితే, సచిన్ టెండూల్కర్ మాత్రం వీరిద్దరి కలయిక అని ఆమె ప్రశంసించారు. "సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ పేరుతో పాటు ఒక భారతీయుడి పేరును ఒకే శ్వాసలో పలికేలా చేసింది సచిన్ మాత్రమే. ప్రతి సందర్భానికీ లతా మంగేష్కర్ పాట ఉన్నట్టే, సచిన్ కూడా అన్ని పరిస్థితులకు అనుగుణంగా మారి అద్భుతాలు చేయగలడు" అని ఆమె పేర్కొన్నారు.

Sachin Tendulkar
Asha Bhosle
Anjali Tendulkar
Asha Bhosle death
Sachin Tendulkar tribute
Indian singer
Arjun Tendulkar wedding
Cricket love
Playing it my way
Lata Mangeshkar

More Telugu News